భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 71 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దాదాపు 24.29 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటిమట్టం పెరగడంతో కరకట్టకు ఆనుకుని గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 71 అడుగులు దాటింది. భద్రాద్రి జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో 95 గ్రామాలు నీటమునిగాయి.
భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ జలదిగ్బంధంలో ఉన్నాయి. అయ్యప్పకాలనీ, కొత్త కాలనీ, రామాలయం ప్రాంతం మునిగిపోయాయి. సుభాష్‌నగర్ కాలనీ, రాజుపేట కాలనీలోకి కూడా భారీగా వరదనీరు చేరింది. అంతకంతకూ పెరుగుతున్న వరదతో ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు.
ఇటు శ్రీరాం సాగర్, కాళేశ్వరానికి వరద ప్రవాహం తగ్గింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 47,215 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 40,984 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1087.90 అడుగులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 76.10 టీఎంసీలుగా ఉంది.
కాళేశ్వరం జలాశయానికి కూడా వరద ప్రవాహం తగ్గింది. మేడిగడ్డ బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 16,71,388 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ మొత్తం 85 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు అధికారులు. అన్నారం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,58,489 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 66 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు.