– రాములోరి భూముల నుంచి పోడు భూముల దాకా!
– సంప్రదింపుల పేరుతో లీజుల క్రమబద్ధీకరణ
– అక్రమ జీవో 2166 ఇంకా కొనసాగింపు
– భూ బదలాయింపు నిషేధిత చట్టానికి తూట్లు
– ఆదివాసీలకు కేటాయించడంలో నిర్లక్ష్యం
– క్రమబద్దీకరణపై ప్రభుత్వాల కథలు పార్ట్ -2
– తొలివెలుగు క్రైం బ్యూరో ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్
ఆదివాసుల ఇష్టదైవం భద్రాద్రి రాముడి భూములు వారికి దక్కనివ్వకుండా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాచలంలో రామచంద్రుడు వెలువక ముందు..ఆదివాసీ మహిళ పోకల దమ్మక్క ఆ దేవుడికి పూజలు చేసిందనేది చరిత్ర.అప్పటి నుంచి వందల యేళ్లు వారే కొలిచారు.కాలం మారుతున్నకొద్దీ.. వారికి చెందాల్సిన భూములు కూడా దక్కనీయకుండా అమాయకపు ఆదివాసుల పై ప్రభుత్వాలు వివిధ జీ.వోలతో ఉక్కుపాదం మోపుతున్నాయి.భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలో ఉన్నభద్రాచలం ప్రాంతం..భూమి బదలాయింపు నిషేధిత చట్టాలు 1959, 1/70, 2/70 అమల్లో ఉన్నాయి. 2/70 ప్రకారం గిరిజనేతరులెవరికీ ఈ భూములు లీజుకు ఇవ్వడం చెల్లదు.కాని భద్రాచలం దేవాలయానికి చెందిన పురుషోత్తమపట్నంలోని సర్వే నంబర్ 17లో ఉన్న917ఎకరాల భూమిని మాత్రం ఏండ్ల తరబడి గిరిజనేతరులే సాగు చేసుకుంటూ లబ్ది పొందుతున్నారు.నాయకులు అవినీతిలో కూరుకుపోయి.. నామమాత్రపు లీజు పేరుతో పెద్దలకు దక్కేలా జీ.వోలు తీసుకొచ్చారు.
భద్రాది రాముల వారి భూముల కథ
భద్రాచలం దేవాలయ భూములకు 200 ఏండ్ల చరిత్ర ఉంది. అయితే అధికారికంగా..1878 అక్టోబర్ 12 వ సోమరాజు పురుషోత్తమదాసు అనే వ్యక్తి రాముల వారి నిత్య పూజకోసం 917 ఎకరాల భూమిని భద్రాచలం దేవాలయానికి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు.గిరిజనులు సాగు చేసుకునే సమయంలో దేవాలయానికి పంటలో వచ్చిన సొమ్ముని దేవుడికి ఇచ్చేవారు. పంటలో పావు వంతు ఆ భూమి సాగు చేసుకున్నందుకు ఎదో విధంగా అప్పగించేవారు.సారవంతమైన భూములు కావడం.. గిరిజనులు ఆధునికత పాటించకపోవడంతో..గిరిజనేతరుల కళ్లు పడ్డాయి.ఇంకేముంది అధికారులను,రాజకీయ నాయకులను మెప్పించి..దేవాలయానికి దమ్మిడి అదాయం లేకుండా చేశారు. పైగా ఆ భూములు తమకు కేటాయించాలనీ, పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారులైన గిరిజనేతరులు చట్టాలను తుంగలోకి తొక్కుతూ ఒత్తిడి తెచ్చారు.కానీ భూమి బదలాయింపు నిషేధిత చట్టాలు మరింత కఠినంగా ఉండటం..కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేయడంతో ఇది సాధ్యం కాలేదు.దీంతో కొంత మంది కోర్టు నుంచైనా దక్కించుకోవాలని చూసినా..గిరిజనేతర రైతులకు చుక్కెదురైంది.
మావోయిస్ట్ ల డిమాండ్ ని సమర్ధించిన కోనేరు రంగారావు కమిషన్
ఆక్రమణలో ఉన్నభూములను ఖాళీ చేయించాలంటూ భద్రాచలం దేవస్థానం ఈవో కోర్టు మెట్టు ఎక్కారు.కాని కబ్జాదారులు..అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో లాబీయింగ్ మొదలు పెట్టారు.క్రమబద్ధీకరించాలంటూ డిమాండ్ చేశారు.ఆదివాసులతో చర్చలు జరపకపోగా..కేవలం కబ్జాదారులతోనే చర్చలు జరపడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కి ప్రతిపాదన చేశారు. అప్పటికే కబ్జాదారుల రిట్ పిటిషన్స్ అన్నింటిని 2010 లో హైకోర్టు డిస్మిస్ చేసింది.అయితే ఏ నాయకుడైనా తన చేతిలో భూములు ఉండాలని చూస్తారు.అది వారి అనుచరుల చేత కబ్జా పెట్టించి..రెగ్యులరైజేషన్ చేసుకోవాలని చూస్తారు.అదివాసుల చట్టాలు..భూ బదలాయింపులు కఠినంగా ఉన్నా.. దక్కించుకునేందుకు ఎన్నోకుట్రలు పన్నారు.మావోయిస్టుల చర్చల్లో భాగంగా వారి డిమాండ్స్ ప్రకారం..అప్పటి ప్రభుత్వం ఆదివాసుల భూముల పై కోనేరు రంగారావు కమిషన్ ను వేసింది.ఆ కమిషన్ ఇచ్చిన తొమ్మిదవ చాప్టర్ లో భద్రాచలం దేవస్థానం భూముల గురించి కమిషన్ వారి అభిప్రాయాన్ని పొందుపరిచింది. ఈ భూములను సాగుచేసుకుంటున్న గిరిజనేతర ఆక్రమణదారులను ఖాళీ చేయించి వీటిని ఆదివాసీలకు కేటాయించాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.కోనేరు రంగారావు కమిషన్ నివేదికను యధాతథంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.కమిషన్ నివేదిక తర్వాత ఆర్వోఆర్ చట్టం కింద రెవెన్యూ శాఖ భద్రాచలం రాముడి పేరుతో 720 ఎకరాలు రాముడి పేరు మీదుగా ఇచ్చారు.
శాపంగా మారిన గిరిజన ఎమ్మెల్యేలు
చట్ట విరుద్ధంగా దేవాయలం భూములను ఆక్రమించిన ఆదివాసేతరులతో అప్పటి అధికార పార్టీకి చెందిన ఆదివాసీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి కుమ్మక్కయ్యారనేది స్థానికుల ఆరోపణ. ఆమె చీకటి అధ్యాయానికి తెరలేపారని.. భూములు ఆదివాసీలకు దక్కకుండా చక్రం తిప్పారంటున్నారు. వారికి హక్కులు కల్పించకపోతే..లీజ్ పేరుతో ఇవ్వాలని ప్రభుత్వానికి లెటర్స్ వ్రాశారు ఎమ్మెల్యే. ఆమె కోరిక మేరకు దేవాదాయ శాఖ చట్ట వ్యతిరేకంగా జీవో విడుదల చేసింది. లీజ్ పేరుతో దందా కొనసాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు ఫైల్ చేరింది.అంతకు ముందే ప్రభుత్వ పెద్దలకు,ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి.ఆదివాసుల భూమి పై..లీజు క్రమబద్దీకరణ ఫైల్ ను బిజినెస్ రూల్స్ ప్రకారం.. న్యాయ శాఖకు,గిరిజన సంక్షేమ శాఖకు పంపాలి.కాని దీనికి భిన్నంగా రెవిన్యూ,ఎండోమెంట్స్ శాఖ ఫైల్ ను పంపి.. అధికారులు ఎలాంటి అభిప్రాయాలు రాయకుండానే గుడ్డిగా సంతకాలు చేశారు. భూ బదలాయింపు నిషేధిత చట్టానికి తూట్లు పొడిచి ఇష్టానుసారంగా వ్యవహారించారు.జీవో నంబర్ 379 ప్రకారం భద్రాచలం దేవాలయం భూములను కూడా లీజుకు ఇస్తున్నట్టు నోట్ ఫైల్ చేశారు. ఈ జీవో ఏజెన్సీ ప్రాంతంలో చెల్లక పోవడంతోనే హైకోర్టు ఆక్రమణదారుల పిటిషన్స్ కొట్టివేసింది. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం మరో అక్రమ జీవో నెం. 2166 ని జారీ చేసింది.జీవో నెంబర్ 2166 ని సవాలు చేస్తే..భూమి మళ్లీ ఆదివాసులకు దక్కే అవకాశం ఉండేది. లేదా రాముల వారికి అదాయం వచ్చే విధంగానైనా చేసేవారు.కాని ఆ దిశగా అడుగులు పడటం లేదు.ఎంతో సారవంతమైన నల్లరేగడి భూముల్లో ఆక్రమణదారులు వదులుకోలేక ఇప్పటికి రాజకీయ పలుకుబడితో ఎన్నోప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణలో రాముల వారు, ఏ.పి.లో భూములు ఉండటంపై ఎవ్వరు నోరు మెదపడం లేదు. రాములవారికి నయా పైసా ఆదాయం రాకున్నా..తెలంగాణ ప్రభుత్వం అటువైపు కూడా చూడటం లేదు.దేవాలయాన్ని అభివృద్ది చేస్తామని ఐదేళ్ల క్రితం చెప్పినా..ఏ.పి.లో ఉన్నా..200 కోట్ల అత్యంత విలువైన రాముడి భూమిని కాపాడుకునే పని మొదలు పెట్టడం లేదు.
ఇప్పుడు ఎందుకీ చర్చ అంటే…!
ప్రభుత్వ భూములను రెగ్యులరైజేషన్ చేస్తున్నతెలంగాణ ప్రభుత్వం గిరిజన,ఆదివాసుల భూ హక్కులను కాలరాస్తోంది. వారి పై వివక్ష చూపిస్తోంది. ఇరు రాష్ట్రాలు వారి హక్కులను పట్టించుకోవడం లేదు. తెలంగాణ అంతటా పోడు భూముల పేరు మీదుగా గిరిజనేతరులు మిషన్లతో వేల ఎకరాల అడవులను నరికివేసి..సాగులోకి తెచ్చుకున్నారని అటవిశాఖ నివేదికలు ఉన్నాయి.ఆర్ధికంగా బలపడేందుకు..టీ.ఆర్.ఎస్ నేతలు..కొద్ది నెలల క్రితమే ఈ పోడు వ్యవహారాన్ని చక్కపెట్టుకున్నారు. కఠిన చట్టాలు ఉన్న భద్రాది భూమి పై ఏం జరిగిందో..తెలంగాణ గిరిజన, ఆదివాసులకు ఏం జరగబోతుందో పూర్తి వివరాలతో తెలియచేసి .. మేలుకొలిపే ప్రయత్నం తొలివెలుగు క్రైం బ్యూరో చేస్తుంది.