అక్రమార్జనకు అలవాటు పడి మందిని మత్తులోకి దించుతున్నారు. మత్తుపదార్థాలు అక్రమ రవాణా చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో గంజాయి దందా పెచ్చుమీరుతున్న తరుణంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. అందిన సమాచారం మేరకు మెరుపుదాడి చేసింది. సంబంధిత దాడిలో అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడని అధికారులు తెలుసుకున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా ఉంచారు.
ఆ సమయంలో అక్కడకి వచ్చిన నిందితుడ్ని పట్టుకున్నారు. స్మగ్లర్ నుంచి 180 కేజీల గంజాయి, కారుని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో మూడు లక్షలకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.36 లక్షలకు అమ్ముకునేందుకు వెళుతున్న క్రమంలో పట్టుకున్నారు. నిందితుడిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
నల్గొండ జిల్లాలో కూడా ఇలానే మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శక్తితని గైరాజు(43) మాచర్ల నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా.. పోలీసులు పెద్దపూర సమీపంలో పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి రూ.55లక్షలు విలువ చేసే 284 కేజీల గంజాయి, ఒక కారు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి ప్రాంతానికి చెందిన అవినాష్ , నిషాల్, రఘు, సతీష్ యువకులు గంజాయికి అలవాటు పడ్డారు. ఉప్పల్ నల్లచెరువు సమీపంలో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో నలుగురిపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల దగ్గర నుంచి రూ.3లక్షల 38వేలు విలువ చేసే గంజాయితో పాటు.. రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ జానకి చెప్పారు.
ఒడిశా నుంచి హైదారాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్లోని మథురకు ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కొండాపూర్లో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో ఉత్రరప్రదేశ్కు చెందిన సౌరవ్ సింగ్, జై ప్రకాష్ సింగ్, రాధా అనే ముగ్గురు నిందితులపై అనుమానం రావడంతో వారిని పట్టుకున్నారు.
ఆరా తీస్తే కారు వెనుక సీటులో గంజాయి పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారని తేలింది. నిందితుల దగ్గర ఉన్న 23 కేజీల గంజాయి, ఒక కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.