భద్రాద్రిలో రాములోరి కల్యాణమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం పదిన్నర గంటలకు మొదలైన ఈ వేడుకను మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిపారు. ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
అభిజిత్ లగ్నంలో రామయ్య సీతమ్మ తల్లి ఒక్కటయ్యారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగల్యధారణ చేశారు. రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించేందుకు భక్తజనకోటి భద్రాద్రికి తరలి వచ్చింది. దీంతో శ్రీరామ నామ స్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పుర వీధులు మార్మోగుతున్నాయి.
వేసవి కాలం కావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మిథిలా మైదానంలో చలువ పందిళ్లు వేశారు. ఫ్యాన్లు, కూలర్లు అమర్చి భక్తులంతా కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. మరో వైపు 2 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది.
సీతారాముల కల్యాణానికి చిన్న జీయర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు,ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు రవిచంద్ర, కవిత తదితరులు పాల్గొన్నారు.