భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మారుమూల అటవీ ప్రాంతంలోని పూసుకుంటను సందర్శించారు గవర్నర్ తమిళిసై. సుమారు ఎనిమిది కిలోమీటర్ల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించిన గవర్నర్.. పూసుకుంటకు చేరుకున్నారు. గవర్నర్ కు గిరిజన సాంప్రదాయ వస్త్రధారణ డప్పు వాయిద్యాలతో గ్రామస్థులు ఆహ్వానం పలికారు. అయితే.. పర్యటనలో భాగంగా.. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ గిరి పోషణ పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు.
గవర్నర్ గ్రాంట్ తో గోగులపూడి, పూసుకుంటలలో వేర్వేరుగా రూ.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు కమ్యూనిటీ హాళ్లు.. రూ.8 లక్షలతో పూసుకుంట ప్రాథమిక పాఠశాల భవనం విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని కొందరి ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె తెలుగులో ప్రసంగించారు. గిరిజనులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని.. మళ్లీ వీలున్నప్పుడు తమ ప్రాంతానికి వస్తానని అన్నారు. తన జీవితంలో ఈ రోజు ఎప్పటికీ గుర్తు ఉంటుందని ఆమె చెప్పారు. కొండరెడ్ల ప్రజలను వారి గ్రామంలోనే కలుసుకోవడం గొప్ప ఆనందంగా ఉందన్నారు. చాలా కాలం నుండి ఈ రోజు కోసం వేచి చూస్తున్నానని వ్యాఖ్యానించారు గవర్నర్.
ఇంత దట్టమైన అడవిలో ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. గవర్నర్ గానే కాకుండా వైద్యురాలిగా మారుమూల గిరిజన పల్లెల్లో పిల్లల పౌష్టికాహార లేమి కలచివేస్తుందని.. మీరు మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నదే తన సంకల్పం అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు గిరిజన గ్రామాల్లో అందించిన సేవలను వివరించారు.