బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేస్తూ వస్తోంది. సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు ఇప్పటికే యాదాద్రికి కొత్త ఆధ్యాత్మిక శోభను తీసుకు వచ్చారు. అత్యంత వైభవంగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించగా భక్తులంతా ఆశ్చర్య పోతున్నారు.
తాజాగా మరో ప్రముఖ ఆలయాన్ని పునర్ నిర్మించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని సరికొత్తగా నిర్మించేందుకు సర్వం సిద్ధం అయింది. వేంగీ చాళుక్యులపై సాధించిన విజయానికి గుర్తుగా పశ్చిమ చాళుక్య రాజు రెండవ పులికేశి ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయానికి సరి కొత్త శోభను తీసుకు వచ్చేందుకు ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులను మంజూరు చేశారు. శ్రీ భద్రకాళి మాడవీదులు, రాజగోపురం నమూనాకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
రాష్ట్రంలో అతిపెద్ద రాజగోపురం, భద్రకాళి మాడ వీధుల నిర్మాణానికి ప్రణాళికలు రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపురం, మాడ వీధుల నమూనాను అధికారులు రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన రూ.30 కోట్ల రూపాయల నిధులతో మాడ వీధుల నిర్మాణాన్ని మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.