– కవితపై బండి వివాదాస్పద వ్యాఖ్యలు
– భగ్గుమన్న బీఆర్ఎస్ వర్గాలు
– రాష్ట్ర మహిళా కమిషన్ సైతం సీరియస్
– నోటీసులు జారీ
– ఢిల్లీ, హైదరాబాద్ లో దిష్టిబొమ్మల దగ్ధం
– మహిళా నేతల గరంగరం
– పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని గులాబీల వార్నింగ్
– పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. తప్పు కవితను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా? అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ లలో సంజయ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఇష్యూలో మహిళా కమిషన్ కూడా కలగజేసుకుంది. సుమోటోగా స్వీకరించి బండికి నోటీసులు పంపింది.
మహిళా నేతల ఫైర్!
బండి వ్యాఖ్యలపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ గడ్డపై పుట్టినవారు కేసులకు భయపడరని.. బీజేపీ మెడలు వంచే రోజులు దగ్గరరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. మహిళా లోకం తిరగబడితే బండి సంజయ్ అధోగతే అంటూ ఫైర్ అయ్యారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. బండి సంజయ్ ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వెంటనే ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బండి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతామంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ మాలోతు కవిత. ఆయనకు అక్కాచెల్లెళ్లు లేరా? అని నిలదీశారు.
కవిత జోలికొస్తే అంతే!
కవిత జోలికొస్తే రాష్ట్రం అట్టుడికిపోతుందని ఇతర బీఆర్ఎస్ నేతలు అల్టిమేటం ఇచ్చారు. ఖబడ్దార్ బండి సంజయ్ అంటూ హెచ్చరించారు. కవితకు బండి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి మల్లారెడ్డి. బీజేపీ లీడర్స్ ఇస్టానుసారంగా మాట్లాడితే హైదరాబాద్ లో తిరగనియ్యబోమని హెచ్చరించారు మంత్రి తలసాని. కేసీఆర్ ను ఎదుర్కోలేక.. కావాలనే కవితపై మోడీ కేసులు పెట్టిస్తున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. కవితకు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే.. ఆయన ఇంటి మీద, ఫ్యామిలీ మీద దాడులు చేయడానికైనా సిద్ధమని ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యానించారు. ఇక బండి సంజయ్ ది నరం లేని నాలుక అంటూ మైనంపల్లి ఫైరయ్యారు.
మహిళా కమిషన్ సీరియస్!
సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై చేసిన వ్యాఖ్యలకు నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. తన ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఢిల్లీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఆందోళనలు
బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో నిరసనలకు దిగారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర ఆందోళన చేపట్టారు. కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. బండి సంజయ్ దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇటు రాష్ట్రంలో కూడా బండి దిష్టిబొమ్మలను దహనం చేశారు నేతలు. వెంటనే ఆయన సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు!
బండి వ్యాఖ్యలపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కేసుల నమోదుపై న్యాయ సలహా తీసుకుంటున్నారు ఖాకీలు. అన్నీ ఒకే తరహా ఫిర్యాదులు కావడంతో ఒక పీఎస్ కు బదిలీ చేసే యోచనలో ఉన్నారు. ఏదైనా ఒక పీఎస్ కు బదిలీ చేసి దర్యాప్తు చేయాలనుకుంటున్నారు. ఇటు మహిళా కమిషన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని కూడా ఆదేశించింది.