బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేననేది కాంగ్రెస్ వాదన. ఢిల్లీలో దోస్తీ.. గల్లీల్లో కుస్తీలా రెండు పార్టీల తీరు ఉందంటూ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రజాసంగ్రామ యాత్ర వేదికగా టీఆర్ఎస్ పై విమర్శల దాడి పెంచింది. పైగా ఢిల్లీ పెద్దల్ని తీసుకొచ్చి మరీ తిట్టిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ ఎప్పటికీ శత్రువులేనని.. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు కేంద్రమంత్రి భగవంత్ కూబా. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదన్నారు భగవంత్. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, రైతులకు ఉచిత విద్యుత్ ఇలా ఏ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తెలంగాణ కోసం వేలాదిమంది అమరులయ్యారని.. కానీ.. రాష్ట్రాన్ని కొడుకు, కూతురు, అల్లుడు పాలిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ గెలిచి టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంలో ఆదర్శవంతమైన సర్కార్ ఉంటే… తెలంగాణలో మాత్రం ఫాంహౌస్ ప్రభుత్వం ఉందంటూ సెటైర్లు వేశారు కేంద్రమంత్రి. కేసీఆర్ సర్కార్ ను ఫాంహౌస్ కే పంపాలని పిలుపునిచ్చారు. ఎంఐఎంతో స్నేహం తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే… ఇప్పటికీ న్యాయం చేయలేదన్న ఆయన.. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేది బీజేపీ మాత్రమేనన్నారు భగవంత్ కూబా.