గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది. ఇక ఖమ్మం ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు నల్లజెండాలు, ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.
కట్టెల మోపులు నెత్తిన పెట్టుకొని మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిలో కూడా ఆందోళనలు మిన్నంటాయి. హైదరాబాద్ ఫిలింనగర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ధర్నాలో మహిళలు భారీగా పాల్గొన్నారు.
గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. నల్లగొండ క్లాక్ టవర్లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మహా ధర్నాను ప్రారంభించారు.
కుమ్రం భీం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మీ, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వర రావు తో పాటు పలు మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.