అగ్నిపథ్ స్కీం ను రద్దు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదికన సైనికులను మనం సైన్యంలో ఉంచలేమన్నారు. కఠినమైన పరిస్థితుల్లోనూ దేశానికి రక్షణగా వారు నిలుస్తారని ఆయన తెలిపారు.
అలాంటి సైనికులను 21 ఏండ్లకే మాజీలుగా ఎలా మారుస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎప్పుడూ రిటైర్ కారని, కేవలం సైనికులు, ప్రజలు మాత్రమే పదవి విరమణ చేస్తారని ఆయన అన్నారు. సైన్యాన్ని అద్దె ప్రతిపాదికన తీసుకోవడం తమకు వద్దన్నారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో గత రెండేండ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలను నిర్వహించలేదన్నారు. అలాంటిది ఇప్పుడు కేవలం నాలుగేండ్ల మాత్రమే సర్వీసులో ఉండాలని కొత్త నిబంధనలను తీసుకురావడం దారుణమని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతం వారికి పెన్షన్ కూడా లేదన్నారు. ఇది సాయుధ బలగాలను అవమానించడమేనని ఆయన అన్నారు. ఇది దేశ యువతకు ద్రోహం చేయడమే అవుతుందన్నారు. ఈ ఆలోచనా రహిత నిర్ణయంతోనే యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయని చెప్పారు. అందువల్ల ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.