హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఎంత ప్రసిద్ధి గాంచిందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలోనైతే నేతలు హడావిడి చేయడంతో ఈ ఆలయం మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయానికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది.
యుఆర్టీఐ అనే సంస్థకు చెందిన ప్రతినిధులు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చెందిన వివరాలను తెలియజేయాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయగా.. అందుకు ఆ సంస్థ సమాధానం ఇచ్చింది.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన నాటి నుంచి చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం మనుగడలోకి వచ్చిందని, అయితే అక్కడ ఉన్న చిల్లాకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమాధానం చెప్పింది. ఇక 1904 పురావస్తు సామగ్రి పరిరక్షణ చట్టం ప్రకారం చార్మినార్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిరక్షించబడుతుందని తెలిపారు.
అయితే డిసెంబర్ 2012లో మరో ఆర్టీఐ యాక్టివిస్టు సరిగ్గా ఇదే అంశంపై సమాచారం కోసం దరఖాస్తు చేయగా.. 1958 ఏఎంఏఎస్ఆర్ యాక్ట్, 1959 రూల్స్, 2010 ఏఎంఎస్ఆర్ యాక్ట్‌ల ప్రకారం.. చార్మినార్ వద్ద ఉన్న ఆలయం అక్రమ నిర్మాణమని తేల్చారు. కాగా ఇదే విషయంపై గతంలో పలుమార్లు కొందరు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని పలువురు యాక్టివిస్టులు తెలిపారు.
https://www.thehindu.com/news/cities/Hyderabad/no-records-of-chilla-adjacent-to-charminar-says-asi/article33864233.ece