ఊరూరా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముందుకు సాగుతోంది. చార్మినార్ నుంచి మొదలైన ఆయన పాదయాత్ర.. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకు చేరింది. భవానీపేట్ నుంచి పాల్వంచకు బండి నడక సాగుతుండగా… బైంసా అల్లర్ల ఘటనలో కేసుల పాలై, జైల్లో మగ్గిపోతున్న బాధితులకు చెందిన కుటుంబ సభ్యులు ఆయన్ను కలిశారు. పీడీ యాక్ట్ కింద తమ వారిని అరెస్ట్ చేసి ..అకారణంగా ఏడు నెలలుగా జైల్లో పెట్టి వేధిస్తున్నారంటూ ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి బెయిల్ రాకుండా చేస్తున్నారని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Advertisements
బైంసా అల్లర్ల బాధిత కుటుంబ సభ్యుల బాధలు విన్న బీజేపీ చీఫ్ బండి సంజయ్.. తప్పకుండా వారిని ఆదుకుంటామని భరోసానిచ్చారు. వారి పిల్లలను ఎత్తుకుని ఓదార్చారు. బాధిత కుటుంబాల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనని అలాగే బాధితులను జైలు నుంచి విడిపించే బాధ్యత బీజేపీనే తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాధితులకు జైలు నుంచి బయటికి వచ్చాక ఉపాధి కల్పించే బాధ్యత కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు.