నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లు చెలరేగిన సందర్భంలో..పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. తాను భైంసా వెళ్తానని సాయంత్రం ప్రకటించిన అర్వింద్.. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి వాహనంలో బయల్దేరారు. అయితే ఆయన్ను బంజారాహిల్స్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, అర్వింద్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనను తన నియోజనవర్గానకి కూడా వెళ్లనివ్వరా అంటూ పోలీసులపై అర్వింద్ ఫైర్ అయ్యారు. అ తర్వాత అర్వింద్‌ను ఆయన ఇంటికి తీసుకెళ్లి.. గృహ నిర్బంధం చేశారు. బైంసాలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేవరకూ బయటకు వెళ్లొదని అర్వింద్ బయటకు వెళ్లొద్దని సూచించారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం ఓ చిన్న గొడవ.. భైంసాలో చిలికిచిలికి గాలివానలా మారింది. సైలెన్సర్ లేకుండా వాహనాలు నడిపారన్న యువకులని మందలించినందుకు ఓ వర్గం.. మరో వర్గంపై దాడికి దిగింది.ఈ క్రమంలో రాళ్లు రువ్వుకోవడంతో పాటు పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం భైంసాలో 144 సెక్షన్ విధించారు. దాదాపు 600 మంది పోలీసు బలగాలను మోహరించారు. కాగా అల్లర్లలో ఇద్దరు పోలీసులు, కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించి పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.