కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈ నెల 28, 29.. రెండురోజులు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయస్ అసోసియేషన్ కూడా బ్యాంకింగ్ సెక్టార్ ఈ సమ్మెలో పాల్గొననున్నట్టు తెలిపింది. బంద్ నేపథ్యంలో కస్టమర్లు ముందుగానే సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి.
లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్రపూరితంగానే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు, రవాణా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్‌కమ్ ట్యాక్స్, కాపర్, వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ మేరకు సమ్మె నోటీసులను జారీ చేశాయి.
రైల్వే, రక్షణ రంగాలకు చెందిన సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా సమ్మె జరిగే వందల చోట్ల భారీ జనసమీకరణకు సహకరిస్తామని వెల్లడించాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ కూడా ఈ సమ్మె వల్ల తన బ్యాంకింగ్ సర్వీసులు ప్రభావితమవుతున్నాయని తెలిపింది.
ఈ రెండు రోజుల సమ్మె నేపథ్యంలో బ్యాంక్ శాఖల సాధారణ కార్యకలాపాలలో ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని వివరించింది. మరోవైపు ఈ రెండు రోజులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కచ్చితంగా ఆఫీసులకు రావాలని.. తప్పనిసరిగా డ్యూటీకి రిపోర్టు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.