భారత్ లో కరోనా మహమ్మారి సుడిగాలి వేగంతో విస్తరింస్తోంది. ఇటీవల నమోదవుతున్న రోజువారీ కేసులు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిపుణులు అంచనాలను సైతం ఈ మహమ్మారి తలకిందుల చేసింది. థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత ఉదృతంగా ఉండదని వైద్యనిపుణులు అంచనా వేశారు. పీక్స్ కి చేరుకునేసరికి లక్షా 80వేల రోజువారీ కేసులు నమోదవుతాయని అంతా భావించారు. కానీ.. అందరి అంచనాలను తలకిందుల చేసి దూసుకుపోతుంది.
ఈ సమయంలో భారత్ బయోటెక్ చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కు కూడా కోవాక్సిన్ బూస్టర్ డోస్ పని చేస్తుందని చెప్పింది. ట్రయల్ సమయంలో బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత.. రెండు డోస్‌లతో పోలిస్తే రోగులలో యాంటీబాడీలు 5 రెట్లు పెరిగాయని ఆ కంపెనీ తెలిపింది. బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో CD4, CD8 కణాల పెరుగుదలను గుర్తించామని ప్రకటించింది. దీని కారణంగా కోవాక్సిన్ కరోనా వైరస్ నుండి సుదీర్ఘ రక్షణను అందిస్తుందని తెలిపింది. దీని వలన దుష్ప్రభావాల అనుకున్న స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయని భారత్ బయోటెక్ చెప్పింది. కోవాక్సిన్ బూస్టర్ డోస్ ఓమిక్రాన్, డెల్టా రెండు వేరియంట్‌లకు చెక్ పెడుతోందని తెలిపారు.
గడిచిన 24 గంటల్లో భారత్ లో 2,47,417 మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్కరోజులోనే 50వేలకు పైగా కేసులు పెరిగాయి. మరోవైపు కరోనా ధాటికి 380 మంది మృతిచెందారు. ఈ రోజు 84,825 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన రికవరీ రేటు ఈ రోజు మళ్లీ పెరిగింది. రోజువారీ 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,63,17,927 కరోనా కేసులు నమోదయ్యాయి.