కరోనా నివారణలో మరో ముందడుగు.. భారత్ బయో టెక్ సంస్థ వారి ‘ఇంట్రా నాసల్ కోవిడ్’ వ్యాక్సిన్ ఈ నెల 26 న మార్కెట్లో అమ్మకానికి వచ్చే అవకాశాలున్నాయి. ముక్కు ద్వారా తీసుకునే ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని ఇదివరకే నిపుణులు తెలిపారు. ‘ఇన్ కోవ్యాక్’ గా వ్యవహరించే ఈ వ్యాక్సిన్ ని ఈ నెల 26 నుంచి విక్రయానికి పంపిణీ చేసే అవకాశాలున్నట్టు భారత్ బయో టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు. భోపాల్ లో నిన్న మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన రెండు డోసుల షెడ్యూలుకు , హెటరోలోగస్ బూస్టర్ డోసుకు అనుమతి లభించిందని ఆయన అన్నారు. రిపబ్లిక్ దినోత్సవం నాడు అధికారికంగా ఈ నాసల్ వ్యాక్సిన్ ని లాంచ్ చేస్తామని కూడా ఆయన చెప్పారు. జనవరి నాలుగో వారం నాటికి తమ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఈ సంస్థ ఇదివరకే ప్రకటించింది. ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనా నివారణలో మంచి ఫలితాలనిచ్చింది. పశువులకు వచ్చే చర్మ సంబంధమైన రుగ్మతకు కూడా మరో వ్యాక్సిన్ వచ్చేనెలలో అందుబాటులో ఉంటుందని కృష్ణ ఎల్లా తెలిపారు. ఈ వ్యాధిని లుంపి స్కిన్ డిసీజ్ గా వ్యవహరిస్తున్నారు.
ఇన్ కోవ్యాక్ నాసల్ వ్యాక్సిన్ ధర రాష్ట్ర ప్రభుత్వాలు, బల్క్ కొనుగోలుదారులకు డోసుకు 325 రూపాయలని, వ్యాపార సంబంధ వ్యాక్సినేషన్ క్లినిక్ లకు డోసుకు 800 రూపాయలని ఈ సంస్థ వెల్లడించింది. మొదటి ఇమ్యునైజేషన్ డోసుతో నిమిత్తం లేకుండా 18 ఏళ్ళ వయస్సు పైబడిన వారంతా బూస్టర్ షాట్ గా దీన్ని తీసుకోవచ్చునని పేర్కొంది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారని వివరించింది. ముక్కు ద్వారా తీసుకునే ఈ టీకాను గత డిసెంబరులో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదించింది. ఆ తరువాత …. పెద్దలు బూస్టర్ షాట్ గా దీన్ని తీసుకోవచ్చునని ఇమ్యునైజేషన్ పై గల నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ కూడా పేర్కొంది.
దేశవ్యాప్తంగా 9 లొకేషన్లలో సుమారు 875 మంది పార్టిసిపెంట్లపై నాసల్ క్లినికల్ ట్రయల్స్ ని నిర్వహించినట్టు భారత్ బయో టెక్ సంస్థ తెలిపింది. ఈ వ్యాక్సిన్ ని 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద సులభంగా స్టోర్ చేయవచ్చునని, పంపిణీ కూడా చేయవచ్చునని ఈ కంపెనీ వెల్లడించింది.