కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిపొందిన భారత్ బయోటెక్.. మరో వ్యాక్సిన్‌కు తయారీకి సిద్ధమవుతోంది. ముక్కు ద్వారా ఇచ్చే మరో వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి దీన్ని రూపొందించనున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇప్పటికే వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఈ వ్యాక్సిన్‌ను బీబీవీ154 (ఇంట్రానాసల్ కొవిడ్ -19 వ్యాక్సిన్) పేరుతో తయారు చేస్తుండగా.. టాక్సికాలజీ, ఇమ్యునోజెనిసిటీ ఛాలెంజ్ స్టడీస్ వంటి పరీక్షలు విజయవంతమైనట్టు తెలిపింది.
భారత్ బయోటెక్ తొలుత నాగాపూర్‌లోని గిల్లుర్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మొదటి, రెండో దశ హ్యూమన్ క్లినికల్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత భువనేశ్వర్, పుణె, నాగపూర్, హైదరాబాద్‌లో ట్రయల్స్ నిర్వహిస్తామని వివరించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు రెండు మోతాదులు అవసరమవుతాయని.. కానీ నాసల్ వ్యాక్సిన్ మాత్రం సింగిల్ డోస్ సరిపోతుందని వెల్లడించింది. అది కూడా నాసికా రంధ్రంలో ఒక చుక్క వేస్తే సరిపోతుందని కంపెనీ చెబుతోంది.