కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పంజాబ్ లో కొనసాగుతోంది. బుధవారం పంజాబ్ లోని ఫతేహగ్ సాహిబ్ లో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. ఈ యాత్రకి పంజాబ్ లో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున స్థానికులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ యాత్రలో మేము సుదీర్ఘ ప్రసంగాలు చేయము. ఈ యాత్ర మాట్లాడేందుకు కాదు.. ప్రజలు చెప్పేది వినేందుకు చేపట్టామన్నారు.
మేము రోజూ ఉదయం 6 గంటలకు నిద్ర లేచి, దాదాపు 25 కిలోమీటర్లు నడుస్తామన్నారు. 6-7 గంటలు మీరందరూ చెప్పేది వింటాం. 10-15 నిమిషాల పాటు మా ప్రణాళికలు ఏంటో చెబుతామన్నారు. ఈ యాత్ర లక్ష్యం ప్రజలు చెప్పేది వినడమే. దేశంలో పెరిగిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను లేవనెత్తి, ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆ యాత్ర ద్వారా పోరాటం చేయడమేనని పేర్కొన్నారు.
దేశంలో బీజేపీ ప్రజల మధ్య ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. దేశం మత సామరస్యం, ఐక్యత, గౌరవానికి సూచిన అని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రకు బీజేపీ పాలిత కర్ణాటకలో పెద్దగా స్పందన రాదని అనుకున్నారని.. కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, మధ్య ప్రదేశ్ లో జోడో యాత్రకు మంచి ఆదరణ లభించిందన్నారు.
దేశంలో ద్వేషం, హింసాత్మక వాతావరణం వ్యాపించిందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లు దేశాన్ని విభజించడానికి పూనుకున్నాయని ఆరోపించారు. ఒక మతం మరో మతానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడమన్నారు. ఒక భాషకు వ్యతిరేకంగా మరో భాషను ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. కాబట్టి దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని భావించి ఈ యాత్ర ప్రారంభించామని వెల్లడించారు రాహుల్ గాంధీ.