మంగళవారం రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతు క్రమంగా పెరుగుతుంది. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమం ఉత్తరాధితో పోల్చితే దక్షిణాధిలో తక్కువగా ఉన్నప్పటికీ, బీజేపీ అంటే మండిపడే పార్టీలన్నీ క్రమంగా బంద్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి.
తెలంగాణలోనూ రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ… రైతుల కోసం తాను భారత్ బంద్ కు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇటు బీజేపీ అంటే వ్యతిరేకించే పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.
రైతులపై ప్రేమో, బీజేపీపై ద్వేషమో కానీ… రైతు ఉద్యమానికి క్రమంగా మద్దతు పెరగటం స్వాగతించదగ్గ అంశమని, ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ పొందిన రైతు ఉద్యమం ఫలితాలనిచ్చేలా ఉండటంతో అంతా మద్దతు పలుకుతున్నారని రైతు సంక్షేమ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.