కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు దేశమంతా స్పందిస్తోంది. రైతులకు మద్దతుగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు రోడ్డెక్కాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం నుంచే బంద్ ప్రభావం కనిపిస్తోంది. తెల్లవారుజామునే తెరుచుకోవాల్సిన పలు దుకాణాలు మూతబడే ఉన్నాయి. బస్సులు,వివిధ వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.
ఏపీలోని గుంటూరు, విజయవాడలో ఉదయాన్నే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు నిరసనకు దిగారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ, సీపీఎం నేతలు బైఠాయించారు.బంద్‌ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం ఒంటిగంట వరకూ విజయవాడలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. అటు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని మరికొన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణలో బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీ భారత్ బంద్‌కు మద్దతునిచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్,టీడీపీ, వామపక్షాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.రైతులకు మద్దతుగా హైదరాబాద్‌లో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి.