కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి వ్యాక్సినేషన్ పైనే ఉన్నాయి. భారత్ లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. వ్యాక్సినేషన్‌లో దేశం మరో మైలురాయిని చేరుకుంది. 18 ఏళ్లు నిండిన వారిలో 75 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దీనిపై కేంద్రప్రభుత్వ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మైలురాయి చేరుకోవడానికి ఆరోగ్య కార్యకర్తలు కీలకపాత్ర పోషించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘనత సాధించడానికి సహకరించిన దేశపౌరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ విజయవంతం చేసేందుకు సహకరించిన వారి పట్ల గర్వంగా ఉందని అన్నారు.
75 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా కరోనా పోరాటంలో ప్రపంచానికి మనం స్పూర్తిగా నిలుస్తున్నామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. సబ్కా సాత్, సబ్కా ప్రయాస్ అనే మంత్రంతో, దేశంలో 18 ఏళ్లు పైబడినవారు 75 శాతం రెండు డోసుల టీకాల తీసుకున్నారని ట్వీట్ చేశారు. కరోనాపై పోరాటం చేసే క్రమంలో దేశం మరింత బలపడిందని తెలిపారు. కరోనా నిబంధలను అందరూ పాటిస్తూ.. వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మన్సుఖ్ మాండవీయ కోరారు.
గత ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 165.7 కోట్ల డోసులు అందించారు. వయోజనులతో పాటు 15-18 ఏళ్ల మధ్యవారికి కూడా 4.69 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. అటు.. ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ప్రారంభించారు.