– కాందిశీకుల భూముల్లో కబ్జాకోరులు
– కోకాపేట అంటూ పుప్పాలగూడ ల్యాండ్స్ అమ్మకాలు
– హోటల్స్ లో విందు, వినోదాలు
– ఐఏఏస్ అరవింద్ కుమార్ పేరు వాడకం
– ప్రైం లొకేషన్ లో 16 లక్షలకే కమర్షియల్ స్పేస్
– రేటు తెలిస్తే దిల్ ఖుష్ అవుతారని అడ్వటైజింగ్స్
– ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్ పెట్టిస్తామంటున్న ఆఫీసర్స్
– భారతి బిల్డర్స్ భూ బాగోతం పార్ట్-2
క్రైంబ్యూరో, తొలివెలుగు:ప్రజలు గొర్రెల్లా చెప్పిందల్లా నమ్మితే.. రియల్టర్స్ తోడేళ్లలా కాచుకుని కూర్చుంటున్నారు. తమకు చార్మినార్, అసెంబ్లీపై కూడా హక్కులు ఉన్నాయని నమ్మిస్తారు. అలాంటి బాగోతమే ఈ భారతి బిల్డర్స్ ఇండియా వారిది. ఏదైనా.. ఎలా ఉన్నా.. ఇసుకలోంచి ఆయిల్ పుట్టించేలా.. కస్టమర్స్ నుంచి ఎంత డబ్బులు పిండామనేదే వీళ్లకు ముఖ్యం. నిత్యం ఉద్యోగంలో బిజీగా ఉండే వారే వీరి టార్గెట్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే వారే పెట్టుబడిదారులు. పసందైన పార్టీలు అడ్వాన్స్ లు కలెక్ట్ చేసుకుంటారు. నెల రోజుల్లో మొత్తం డబ్బులు కడితే మీ సొంతిళ్లు ఇక్కడ ఉండబోతుందని అద్దాల మేడలు చూపిస్తారు. అలా నమ్మి ఇప్పటివరకు మోసపోయిన వారు 500 మందిపైనే ఉన్నారు. వీళ్ల మోసం చూస్తుంటే.. ఆయుధాలు పట్టిన దారి దోపిడీదారులకంటే దారుణంగా అనిపిస్తోంది. లిటిగేషన్ ఉందని అడిగితే హెచ్ఎండీఏ కమిషనర్ సీనియర్ ఐఏఏస్ అరవింద్ కుమార్ క్లియర్ చేస్తారని హామీలు ఇస్తున్నారు. అత్యంత వివాదాస్పద భూముల్లో ఎలాంటి టైటిల్ లేకుండానే హైకోర్టు స్టేటస్ కో అమల్లో ఉండగా అమ్మకం జరపడం వివాదాస్పదమవుతోంది.
కోకాపేట అంటూ కేకలు
పుప్పాలగూడలోని 302, 303 సర్వే నెంబర్స్ లో 8 ఎకరాలు తమదంటూ.. కోకాపేట పేరును వాడుతున్నారు. అక్కడి రెవెన్యూ పరిధిలో 240 సర్వే నెంబర్ వరకే కేటాయించారు. పుప్పాలగూడ అని చెబితే కాందిశీకుల భూమి అని అనుమానం వస్తుంది. సో.. ల్యాండ్ మార్క్ ఏదైనా.. ఎలా అయినా వాడేస్తున్నారు. 1954 నుంచి తమ వద్ద లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు. 2016లోనే ఆ సర్వే నెంబర్స్ లో ప్లాట్స్ చేసి అమ్మేందుకు చూడగా.. కోర్టులో పలు పిటిషన్స్ దాఖలు అవడంతో స్టేటస్ కో అమల్లోకి వచ్చింది. ప్రైవేట్ వారు ఎవరైనా అక్రమంగా అమ్మకాలు లేదా పొజిషన్ తీసుకోవాలని చూసినా క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటివరకు ఆ సర్వే నెంబర్స్ లో పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పటి నుంచి ఏ ఒక్క రిజిస్ట్రేషన్ కాలేదు.
విందులు, వినోదాలు
ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు కానీ, ఎంతోకొంత లాగేయాలనే ఉద్దేశంతో పుప్పాలగూడ భూములను ప్రీ లాంచ్ పేరుతో అమ్మకానికి పెట్టారు. ఆకర్షించే విధంగా రెరా, హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయని పోస్టర్స్ పై ముద్రించుకున్నారు. ఫిబ్రవరి 19న 50 మంది ఏజెంట్స్ కి , 50 మంది సాఫ్ట్ వేర్లకు ఖాజాగూడ సిల్వర్ కీ లో కాక్ టైల్ పార్టీ ఏర్పాటు చేశారు. 16 లక్షల పెట్టుబడి పెడితే 250 స్క్వేర్ ఫీట్ల కమర్షియల్ స్పేస్ తో పాటు.. ఇప్పటి నుంచే నెలకు 12 వేలు అద్దె కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అప్పటికే వడ్డీల రూపంలో నెలకు రెండు కోట్ల వరకు చెల్లిస్తున్నారు. వడ్డీల కంటే కస్టమర్స్ కష్టార్జితంపై ఈజీగా డబ్బులు లాగేయొచ్చనే ఉద్దేశంతో తమది కాని భూమిని అమ్మకానికి పెట్టారు. ప్రైస్ వింటే ఖుషీ అవుతారని అకర్షనీయమైన టైటిల్స్ వదిలారు. దీంతో కొంతమంది సాప్ట్ వేర్స్ డబ్బులు చెల్లించినట్లు సమాచారం.
ఫిర్యాదులు అందితే కేసులు పెడతాం!
రాష్ట్ర ప్రభుత్వం తమ భూమి అని ఎప్పటి నుంచో వాదిస్తోంది. కాందిశీకుల భూముల్లో వ్యవసాయం చేసుకున్న కుటుంబాలు కోర్టులో తమదే అంటూ ఫైట్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి దగ్గరగా ఉండే బడాబాబులు సెటిల్మెంట్స్ చేసుకుని అనుమతులు తీసుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఈ భూములపై వందల కోట్లు సంపాదించిన వారు ఉన్నారు. కొందరు అత్యుత్సాహంతో అమ్మకుండా ఎంతో జాగ్రత్తగా బడాబాబులతో పెట్టుబడులు పెట్టించి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, భారతి బిల్డర్స్ ఎండీ శివరామకృష్ణ మాత్రం ఎలాంటి పొజిషన్, న్యాయపరంగా కోర్టులో గెలిచిన పత్రాలు లేకుండానే అమ్ముకోవడంతో.. ఎంతోమంది అమాయకుల సొమ్ము వీరి పాలు అవుతోంది. జాగ్రత్తగా లేకపోతే.. పెట్టిన సొమ్ము దశాబ్దాలు గడిచినా ఇంటికి చేరే అవకాశాలు ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటు సైబర్ క్రైం పై ఎలా అయితే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారో.. రియల్ మోసాలపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలని బాధితులు వేడుకుంటున్నారు.