వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కడపలో సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే భాస్కర్ రెడ్డి వచ్చే సమయానికి అధికారులెవరూ లేకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే వస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీబీఐ అరెస్టు సహా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. హత్యా స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డి వెంట వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా కడప సెంట్రల్ జైలు వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలు చెరిపివేస్తున్న సమయంలో భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలంలోనే ఉన్నారనేది సీబీఐ అభియోగం. వివేకా హత్యకు కుట్ర పన్నిన వారిలో అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలతో పాటు భాస్కర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ భావిస్తోంది. ఇక హత్యకు ముందు రోజైన మార్చి 14న ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్.. భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు సీబీఐ తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది. దీంతో అవినాష్ రెడ్డి తో పాటు భాస్కర్ రెడ్డి విచారణ కీలకంగా మారింది.