రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందనడానికి సీఎం కేసీఆర్ పరాకాష్ఠగా నిలుస్తున్నారని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి సమస్యల గురించి చర్చించేందుకు సీఎం అపాయింట్ మెంట్ కోరితే ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరారు భట్టి. ఈ మేరకు సోమవారం సీఎల్పీ పక్షాన ఆయన సీఎంకు లేఖ రాశారు.
ఈనెల 1 నుంచి 7వ తేదీలోపు వీలున్నప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు భట్టి.
ప్రజల్లోకి వెళ్తేనే వారి సమస్యలు తెలుస్తాయని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంతో కొట్లాడాలని సీఎంకు సూచించారు. కేంద్రం నుండి రావలసిన నిధులు అందేవరకు పోరాడాలని అన్నారు భట్టి.