బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. ఒకరిద్దరి చేతిలో సంపద పోగుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు భట్టి. మహత్ముడి ఆలోచనలకు అనుగుణంగా దేశంలో పాలన జరగటం లేదని విమర్శించారు. దేశంలో విభజన, అశాంతి.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీ అసమానతలు లేని దేశం కావాలని కోరుకున్నారని ఆయన తెలిపారు. బీజేపీ పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగి గాంధీ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మతాన్ని చొప్పించి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు భట్టి అభిప్రాయపడ్డారు.
గాంధీజీ అసమానతలు లేని దేశం కావాలని కోరుకున్నారని.. మోడీ పాలనలో మాత్రం ఆర్థిక అసమానతలు పెరిగాయని అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బస్తీల్లోని స్వచ్ఛతపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు. త్వరలోనే సీఎల్పీ పక్షాన బస్తీబాట చేపట్టి.. సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై స్పందించిన భట్టి.. పార్టీ ప్రకటించిన తర్వాత దానిపై మాట్లాడతానని పేర్కొన్నారు.
మల్లిఖార్జున ఖర్గే అపార అనుభవం కలిగిన నాయకుడు. ఏఐసీసీ అధ్యక్ష బరిలో ఖర్గే నిలవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. శశిథరూర్ కూడా ఖర్గేకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. ఖర్గే పేరు తెరమీదకు రావడంతో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రిగా, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్‌గా ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉందన్నారు. ఖర్గే ఎన్నికకు దేశంలోని కాంగ్రెస్ నాయకులందరూ సహకరించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.