తెలంగాణ బడ్జెట్ పై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రకటనలకే పరిమితం అవుతోందని.. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీరడం లేదని ఆరోపించారు. ప్రతీ ఏడాది బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారే గానీ.. అమలు విషయంలో మాత్రం కోతలు పెడుతున్నారని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో సంపద తక్కువ ఉన్నప్పుడు రైతులకు అనేక రకాల సబ్సిడీలు ఇచ్చామని గుర్తు చేశారు భట్టి. ఇప్పుడు సంపద బాగా పెరిగిందని చెబుతున్న రాష్ట్రంలో రైతు బంధు పేరుతో రూ.5వేలు ఇచ్చి పండుగ చేసుకోమంటే ఎలా అని ప్రశ్నించారు. రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సౌకర్యాలు, సబ్సిడీలు అన్నీ ఇచ్చి.. రైతు బంధు కూడా ఇస్తే వారికి న్యాయం చేసినట్లు అవుతుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో పేదలకు బియ్యంతో పాటు 9 రకాల వస్తువుల సంచి ఇచ్చామన్నారు భట్టి. కానీ ఇప్పుడు పేదలకు ఇచ్చే బియ్యం సంచి లేదు.. అందులో సరుకు కూడా లేదని సెటైర్లు వేశారు. అంతా మాయం అయ్యిందన్నారు. పేదలకు అందని సంపద ఎందుకని నిలదీశారు.
మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రపై అసెంబ్లీలో ప్రస్తావించారు భట్టి. మంత్రి పై సుపారీ ఇచ్చే పరిస్థితి వచ్చిందని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదన్నారు. మంత్రికే రక్షణ లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సుపారీ అంశంపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.
గత ఎనిమిదేళ్లలో గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదని ఫైరయ్యారు. సంపద, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని.. పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఎంటని నిలదీశారు.