- మోడీకి బహిరంగ లేఖ
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
TO,
శ్రీ నరేంద్రమోడీ గారు,
భారత ప్రధాన మంత్రి, న్యూ ఢిల్లీ.
శ్రీయుత గౌరవనీయులైన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి….
విషయం: 2014 విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని కోరుతూ రాస్తున్నబహిరంగ లేఖ.
సార్…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడి ప్రజల దశాబ్దాల కల.. ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక పోరాటాలు ఆందోళనలు జరిగాయి. యువకులు ప్రాణ త్యాగాలు చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, AICC అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నారు. ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చారు.
2014 ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించి నేటికి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా, వాటిలో పొందుపరిచిన ఒక్క హామీ కూడా నేటి వరకు అమలుకు నోచుకోలేదు. మీరు రెండోసారి ప్రధాని అయ్యారు కాని, ఇంతవరకు విభజన చట్టం అమలుకు కనీసం హామీ కుడా ఇవ్వకపోవటం విచారకరం.ఈ ఎనిమిదేండ్ల కాలంలో మీరు అనేక పర్యాయాలు హైదరాబాద్ వచ్చివెళ్ళినా ఏ ఒక్క సభలో కూడా విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించకపోవటం శోచనీయం.
మీరు అటు పార్లమెంటులో గాని,బయటగాని విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించకపోగా,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపడుతూ మీరు మాట్లాడటం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచటమే.తల్లిని చంపి, పిల్లను బ్రతికించారు అంటూ మీరు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల మీకున్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి.
మీరు ప్రధానిగా భాద్యతలు చేపట్టిన వెంటనే,విభజన చట్టంలో లేకపోయినా, తెలంగాణ ప్రాంతంలోని 7 మండలాలు, సుమారు 2 లక్షల ఎకరాల భూమిని ఆఘమేఘాలపై ఆర్డినెన్సు ద్వారా ఏపీలో విలీనం చేశారు. అంతే కాకుండా సీలేరులోని జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పగించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు విభజన చట్టం ద్వారా పార్లమెంటు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఆశిస్తున్నాను.పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయటం అంటే ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాజ్యాంగాన్ని గౌరవించటమే అవుతుంది.
మూడు రోజుల పాటు మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరబాద్ లో జరుగుతున్న సందర్భంగా మీరు హైదరబాద్ వస్తున్నారు.కనీసం ఇప్పుడైనా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేస్తానని హామీ ఇవ్వాలని కోరుతున్నాను. లేదంటే చట్టసభలపై ప్రజలకు విశ్వాసం పోతుంది. చట్టసభలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన పార్లమెంటు చేసిన చట్టానికి మీరు విలువ ఇవ్వకపోతే ఎలా..? రాజ్యాంగ బద్ధంగా చేసిన చట్టాన్నిమీ ప్రభుత్వం విస్మరించటం సరికాదు. విభజన చట్టాన్నిఅమలు చేయకపోవడం అంటే మీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తుంది అని అర్ధం అవుతోంది.
విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను తక్షణమే అమలుచేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఈ లేఖ ద్వారా
నేను మిమ్మల్ని కోరుతున్నాను…
1. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
2. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
3. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
4. ఐఐఐటి.., ఐఐఎంల ఏర్పాటు
5. నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు
6. కొత్తగా ఏర్పాటు చెసే పరిశ్రమలకు రాయితీల కల్పన
7. నవోదయ స్కూల్స్ ఏర్పాటు..
8. యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటిఐఆర్ రద్దు చేశారు. దీంతో లక్షలాదిమంది తెలంగాణ బిడ్డలు ఉపాధి అవకాశాలు కోల్పోయారు. తెలంగాణ యువత భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగలరు.
9. తెలంగాణలోని ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించలేదు.
10. NTPC ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు..
ఇట్లు
భట్టి విక్రమార్క మల్లు
కాంగ్రెస్ శాసనపక్ష నాయకుడు
తెలంగాణ