భారీ వర్షాలతో హైదరాబాద్ మల్లాపూర్‌లోని భవాని నగర్ నీట మునిగినంత పనైపోయింది. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుండటతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పొంగిపొర్లడంతో ఆందోళన చెందుతున్నారు.
నాలా పని మొదలుపెట్టి ఇప్పటికీ పది నెలలు కావస్తున్నా… ఇంతవరకు పూర్తి చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకునే నాధుడు కరువయ్యాడని మండిపడుతున్నారు. ఇంటి నుంచి ఎవరైనా బయటకు వెళ్తే.. తిరిగివచ్చే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భవానినగర్ సమస్యను అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసలు మల్లాపూర్ భవాని నగర్ హైదరాబాద్‌లోనే ఉందా.. డివిజన్‌కు కార్పొరేటర్ ఉన్నాడా లేదా అన్న అనుమానం కలుగుతోందని విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో కనిపించిన కార్పొరేటర్.. మళ్లీ మొహం చూపించింది లేదని విరుచుకుపడ్డారు. కాలనీలో త్వరితగతిన నాలా పనులు పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.