థియేటర్లలో భీమ్లానాయక్ హవా దాదాపు ముగిసింది. బయ్యర్లకు అది మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ వారాంతానికి ఈ సినిమా ఫైనల్ రన్ కు వచ్చేస్తుంది. అప్పుడిక క్లోజింగ్ కలెక్షన్లు కూడా బయటకొస్తాయి. అయితే అంతలోనే ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఈ మూవీ టైటిల్ హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం భీమ్లానాయక్ ఓటీటీ రిలీజ్.
అవును.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈనెల 25న డిస్నీహాట్ స్టార్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. దీంతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమా కేవలం డిస్నీలో మాత్రమే కాదు.. ఆహా యాప్ లో కూడా అదే రోజున స్ట్రీమింగ్ కు రాబోతోంది.
డిస్నీతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొని మరీ, భీమ్లా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది ఆహా సంస్థ. అయితే డిజిటల్ పూర్తి రైట్స్ మాత్రం డిస్నీవే. ఆహాకు ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ కు ఇచ్చారు, రెవెన్యూ షేరింగ్ మోడల్ ఏంటనేది వాళ్ల ఇంటర్నల్ వ్యవహారం.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రానా కూడా నటించాడు. దాదాపు అతడిది కూడా హీరో పాత్రే. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లానాయక్ లో నిత్యామీనన్, సంయుక్తమీనన్ హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ అందించిన డైలాగులు, తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.