భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేశారు.
సాయంత్రం 4 గంటల నుండి ఈవెంట్ కారణంగా యూసుఫ్‌గూడలో భారీ ట్రాఫిక్ ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సోమవారం జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. అలాగే బుధవారం ఈవెంట్ కోసం కొత్త పాస్‌లు జారీ చేయబడ్డాయి. పాస్ లేని వారు ఈవెంట్‌కు హాజరుకాటానికి వీలులేదు.
సాధారణంగా, పాస్ లేకుండా అతి ఉత్సాహంగా ఉండే అభిమానులు వేదిక వెలుపల గుమిగూడి గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటారు. అలా గొడవలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా సభా వేదిక వద్దకు వెళ్లేందుకు అభిమానులు ప్రజా రవాణాను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి కనీసం 10,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకాబోతున్నా సంగతి తెలిసిందే.