సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే, తొలిరోజు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి.
ఇక ఈ సినిమా మహేష్ అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులకు కూడా కిక్కిస్తోంది. ఎందుకంటే.. ఈ మూవీలో ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్‌లోని ఓ పాట వినపడుతోంది. దీంతో ఇద్దరి స్టార్ హీరోల ఫ్యాన్స్ థియేటర్లలో పండగ చేసుకుంటున్నారు.
మహేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నటుడు సుబ్బరాజ్ ఓ కీలకపాత్రలో నటించారు. అయితే, సినిమాలో సుబ్బరాజ్ పాత్రకు మొబైల్ రింగ్ టోన్‌గా ‘లాలా భీమ్లా..’ సాంగ్ పెట్టి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఇక సినిమాలో పదే పదే సుబ్బరాజుకు హీరో మహేష్‌బాబు కాల్ చేస్తుంటారు. దీంతో సుబ్బరాజు ఫోన్ మోగినప్పుడల్లా ‘లాలా.. భీమ్లా..’ అనే రింగ్ టోన్ వినిపిస్తుంది. ఈ రింగ్ టోన్ వినిపించినప్పుడల్లా థియేటర్లలో పవర్ స్టార్ అభిమానులు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.
దీంతో సర్కారు వారి పాట ప్రదర్శితం అవుతున్న థియేటర్లలో మహేష్ అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానుల కోలాహలం కూడా కనిపిస్తోంది. అయితే, స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఇలా ఒక హీరో సినిమాలో మరో హీరో సాంగ్ వినిపించడం అనేది స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.