భీమ్లానాయక్ సినిమాను ఈమధ్య పవన్ కల్యాణ్ చూశాడు. అవుట్ పుట్ పై పూర్తి సంతృప్తి వ్యక్తంచేశాడు. యూనిట్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. మరోవైపు సినిమా విడుదలపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. ఈనెల 25న రిలీజ్ అవుతుందా, లేక ఏప్రిల్ 1కి వస్తుందా అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. అయితే షాకింగ్ ఏంటంటే.. భీమ్లానాయక్ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు.
అవును.. భీమ్లానాయక్ షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. ఇదేదో గాసిప్ కాదు. స్వయంగా యూనిట్ అధికారికంగా ప్రకటించిన మేటర్. ఈరోజు హైదరాబాద్ లో సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. పవన్ కల్యాణ్ పై టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. రేపు లేదా ఎల్లుండికి ఈ సాంగ్ షూటింగ్ పూర్తిచేయాలని అనుకుంటున్నారు. దీంతో ఆశ్చర్యపోవడం జనాల వంతయింది.
నిజానికి ఓ పాటను చివరి వరకు అలా వదిలేయడం పవన్ కు కొత్త కాదు. నిజానికి ఇది పవన్ స్టయిల్ కూడా. షూటింగ్ అయిపోతుంది, ఎడిటింగ్ కూడా అయిపోతుంది. అప్పటివరకు సాంగ్ షూటింగ్ చేయడు పవన్. ఇది ఆయన స్టయిల్. భీమ్లానాయక్ కు కూడా అదే ఫాలో అయ్యాడు. అయితే అజ్ఞాతవాసి విషయంలో ఈ స్టయిల్ మరీ శృతిమించింది. సరిగ్గా విడుదలకు వారం ముందు సాంగ్ షూట్ కోసం విదేశాలకు వెళ్లారు. హడావుడిగా ఆ పాటను ఆఖరి నిమిషంలో తగిలించారు.
భీమ్లానాయక్ కు ఆ టెన్షన్ లేదు. ఈ సినిమాను 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి చాలా టైమ్ ఉంది. ఒకవేళ 25న రిలీజ్ అవ్వకపోతే ఏప్రిల్ 1కు సినిమా వస్తుంది. ఈ విడుదల తేదీ ఏపీలో పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏపీలో టికెట్ రేట్లపై కొత్త జీవో వచ్చి, థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీ ఇచ్చి, సెకెండ్ షోకు కూడా అనుమతి ఇస్తే అప్పుడు భీమ్లానాయక్ రిలీజ్ అవుతుంది.