అంతా ఊహించినట్టే జరిగింది. భీమ్లానాయక్ రాకతో మిగతా సినిమాలన్నీ తప్పుకున్నాయి. ఇంతకుముందు భీమ్లానాయక్ తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు, గని సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ఎప్పుడైతే భీమ్లానాయక్ ను ఫిబ్రవరి 25న తీసుకొస్తామని ప్రకటించారో, ఆ వెంటనే గని సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా వాయిదా వేశారు.
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. గతేడాది ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. లెక్కలన్నీ వేసుకొని ఎట్టకేలకు ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నారు. అయితే వీళ్లు ఇలా పొద్దున్న పోస్టర్ రిలీజ్ చేశారో లేదో, సాయంత్రానికి భీమ్లానాయక్ రిలీజ్ పోస్టర్ పడింది. దీంతో గని సినిమాను మరోసారి వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే గని సినిమాను వాయిదా వేసినప్పటికీ, శర్వానంద్ మాత్రం తగ్గలేదు. ఓవైపు భీమ్లానాయక్ రిలీజ్ పోస్టర్ వచ్చినప్పటికీ, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రచారాన్ని కొనసాగించారు. ఒక దశలో భీమ్లానాయక్ విడుదలైన 24 గంటల గ్యాప్ లో శర్వానంద్ సినిమా వస్తుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే శర్వానంద్ కూడా వాయిదాకే మొగ్గుచూపాడు. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇలా శర్వా, వరుణ్ తేజ్ తప్పుకోవడంతో భీమ్లానాయక్ కు సోలో రిలీజ్ దొరికింది. దీనికితోడు ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. టికెట్ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఈసారి పవన్ కల్యాణ్ సినిమాకు రికార్డ్ వసూళ్లు వస్తాయని భావిస్తోంది ట్రేడ్. పైగా బాక్సాఫీస్ మొత్తం ఇప్పుడు ఖాళీగా ఉంది. భీమ్లాతో బాక్సాఫీస్ కు ఓ ఊపు వచ్చేలా ఉంది.