పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. తెలంగాణలో ఐదో షోకు పర్మిషన్ ఇచ్చినా.. ఏపీలో మాత్రం పాత పద్దతులే వర్తిస్తాయని అధికారులు తేల్చేశారు. దీంతో డిస్టిబ్యూటర్స్ అయోమయంలో పడ్డారు.
ఈమధ్య స్టార్ హీరోలు సీఎం జగన్ ను కలిసి త్వరలోనే సమస్య కొలిక్కి వస్తుందని ప్రకటించారు. చర్చలు సానుకూలంగానే జరిగాయని అన్నారు. దీంతో భీమ్లా నాయక్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవులే అని అనుకున్నారు డిస్టిబ్యూటర్స్, ఫ్యాన్స్. కానీ.. జగన్ ప్రభుత్వం మాత్రం షాకిచ్చింది.
కొన్ని జిల్లాల్లో భీమ్లా నాయక్ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పాత ధరలకే టికెట్లు విక్రయించాలంటూ ఎగ్జిబిటర్లకు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు పవన్ అభిమానులు తెలంగాణకు క్యూ కట్టారు. ఏపీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని.. థియేటర్ల దగ్గర సరిగ్గా టికెట్స్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుందామన్నా సైట్స్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. పైగా బెన్ ఫిట్ షోకు ఏపీలో పర్మిషన్ లేకపోవడంతో అభిమాన హీరో సినిమాను ఉదయమే చూసేందుకు తెలంగాణకు క్యూ కట్టారు. అటు.. సరిహద్దు గ్రామాల్లోని పవన్ ఫ్యాన్స్ తెలంగాణలో బెన్ ఫిట్ షో చూసేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు.