పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ ట్రయిలర్ రిలీజైంది. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులంతా దీన్ని మెచ్చుకుంటున్నారు. అయితే నిజంగా ట్రయిలర్ లో అంత సీన్ ఉందా అంటే అంతా నిశ్శబ్దం. అవును.. భీమ్లానాయక్ ట్రయిలర్ ఆశించిన స్థాయిలో లేదు. మంచి సీన్లు పడలేదు. పవన్ పంచ్ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే దారుణం. పవన్-త్రివిక్రమ్ కాంబో నుంచి ఆశించిన ట్రయిలర్ అయితే ఇది కాదు.
మరి ఇలాంటి ట్రయిలర్ భీమ్లానాయక్ యూనిట్ నుంచి ఎందుకొచ్చింది? దీనికి యూనిట్ లోని కొంతమంది నుంచి వినిపిస్తున్న సమాధానం ఒకటే. ట్రయిలర్ కటింగ్ కు సమయం లేదు, హడావుడిగా కట్ చేసి రిలీజ్ చేశారు. ఈ విషయం ట్రయిలర్ చూస్తేనే తెలుస్తోంది. అంత హడావుడి ఎందుకు అసలు?
భీమ్లానాయక్ సినిమాను కుదిరితే ఫిబ్రవరి 25న, కుదరకపోతే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పైకి అలా చెప్పినప్పటికీ ఏప్రిల్ 1 తేదీకి దాదాపు యూనిట్ ఫిక్స్ అయింది. పనులు కూడా అందుకు తగ్గట్టే నిదానంగా చేసుకుంటూ వస్తోంది. కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వత్తిడి మేరకు ఉన్నఫలంగా ఫిబ్రవరి 25కి సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందట.
ఎప్పుడైతే ఫిబ్రవరి 25 అనుకున్నారో అప్పుడిక ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఎందుకంటే, అప్పటికి ఓ సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తిచేయలేదు. పోనీ ఆ పాటను వదిలేద్దామంటే అది టైటిల్ సాంగ్. మరోవైపు రీ-రికార్డింగ్ పనుల్ని తమన్ తాత్కాలికంగా పక్కనపెట్టాడు. అతడ్ని మళ్లీ లైన్లోకి తీసుకురావాల్సి వచ్చింది. ఈ హడావుడిలో ట్రయిలర్ కట్ ను పర్యవేక్షించడానికి త్రివిక్రమ్ కు టైమ్ లేకుండా పోయింది. దీంతో 5-6 క్లిప్స్ అలా తీసుకొని, ఇలా అతికించి ట్రయిలర్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.