భారత్ రాష్ట్ర సమితితో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది కేసీఆర్ ఆలోచన. ప్రస్తుతానికి బీఆర్ఎస్ అనేది ఎన్నికల సంఘం దగ్గర ఉంది. ఈసీ ఓకే అనే వరకు టీఆర్ఎస్ గానే కొనసాగుతుంది. అయితే, బీఆర్ఎస్ ప్రకటనతో ఉత్సాహంగా ఉన్న గులాబీ శ్రేణులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు భిక్షపతి. ఈనెల 9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్ లో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. సమైక్య వాది ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి చేశారని మండిపడ్డారు అలాగే వీఆర్ఏల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు భిక్షపతి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తానేంటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కేసీఆర్, ధర్మారెడ్డి విధి విధానాలు, ఏకపక్ష పోకడలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
గత కొంత కాలంగా పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్న భిక్షపతి రెండు రోజుల క్రితం మునుగోడులో ఈటల రాజేందర్ ను కలిశారు. చర్చలు ఫలించి ముహూర్తం పెట్టుకుని టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో మహాకూటమి నుంచి బరిలో నిలిచిన బిక్షపతి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ మరణానంతరం సురేఖ తన పదవికి రాజీనామా చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించి నిరాశపడ్డారు. ఆ తర్వాత అధికార పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఆదరణ కరువైందనే అంసతృప్తితో ఉన్నారు. ఈక్రమంలోనే టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరబోతున్నారు.