గురువారమే జైలు నుంచి విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ శుక్రవారం జమా మసీద్ ప్రార్ధనల దగ్గర ప్రత్యక్షమయ్యాడు. 24 గంటల్లో ఢిల్లీని విడిచి వెళ్లాల్సిందిగా గురువారం సాయంత్రం బెయిలిస్తూ కోర్టు ఆదేశించింది. కోర్టు డెడ్ లైన్ ఇంకా కొన్ని గంటల్లో ముగియనుండగా…చంద్రశేఖర ఆజాద్ జమా మసీదు దగ్గర నిరసనకారులతో కలిశారు. రాజ్యాంగంలోని పీఠికను చదివి వినిపించారు. ఓల్డ్ ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాలకు వందలాది మంది చంద్రశేఖర్ మద్దతుదారులు ఆయన చుట్టూ చేరి మద్దతు పలికారు. ఒక మద్దతుదారుడు చంద్రశేఖర్ కు బ్లూ తలపాగా పెట్టారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నగరంలోని షహీన్ బాగ్ లో నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను చంద్రశేఖర్ ప్రశంసించారు. అయితే చంద్రశేఖర్ ఎక్కడా నిరసనల్లో పాల్గొనలేదని పోలీసులు తెలిపారు.
డిసెంబర్ 21న ఢిల్లీ జమా మసీదు దగ్గర నిరసనల్లో పాల్గొన్న చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు హింస, అల్లర్లకు పాల్పడినట్టు, ప్రజలను రెచ్చగొట్టినట్టు తప్పుడు కేసుల్లో ఇరికించింది. నెల రోజుల తర్వాత గురువారం రాత్రి 9 గంటలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 24 గంటల్లో ఢిల్లీ విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది.