భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాదా్ ను పోలీసులు శనివారం ఉదయం ఢిల్లీ జమా మసీదు దగ్గర అరెస్ట్ చేశారు. శుక్రవారం ఢిల్లీ ఓల్డ్ సిటీలో అల్లర్లకు పాల్పడిన కేసులో చంద్రశేఖర్ తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. ఆజాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నప్పుడు వందలాది మంది ఆజాద్ మద్దతుదారులు భీమ్ ఆర్మీ జెండాలు ఊపుతూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఆజాద్ ప్రజలను హింసకు ప్రేరేపించారని పోలీసులు తెలపగా.. తన మద్దతుదారులు ఎవరూ హింసాత్మక సంఘటనలకు పాల్పడలేదని ఆజాద్ స్పష్టం చేశారు.
ఢిల్లీలో శుక్రవారం చంద్రశేఖర్ నేతృత్వంలో పౌరసత్వ చట్టంపై జమా మసీదు దగ్గర నిరసన కొనసాగింది. ఈ నిరసన కార్యక్రమంలో చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్ది సేపటికే భీమ్ ఆర్మీ కార్యకర్తలు పోలీస్ కస్టడీ నుంచి తప్పంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన హింసలో 8 మంది పోలీసులతో సహా 36 మంది గాయపడ్డారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జమా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకు ప్రదర్శన నిర్వహించడానికి చంద్రశేఖర్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని తీశారు. ”నా పేరు చంద్రశేఖర్ ఆజాద్…నేను ఎక్కడికైనా వెళతా…పోలీసులు నన్ను బంధీగా పట్టుకోలేరు…నేను టోపీ పెట్టుకొని శాలువ కప్పుకొని చాలా ఈజీగా మసీదులోకి ప్రవేశించాను” అని మీడియాతో తెలిపారు.