సొంత ఊరిలో చేసుకోవడానికి పనులు లేక బతుకుదెరువుకు వలసలు పోతారు చాల మంది. అలా వలసలు పోయి అక్కడే స్థిర పడిన వారు కూడా ఉన్నారు. అలాంటి కోవకు చెందిన ఓ మహిళ ఇప్పుడు వలస వెళ్లిన గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికైంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం బాగల్ కోట్ జిల్లా కాటగేరి గ్రామానికి చెందిన భీమవ్వ.. తన భర్తతో కలిసి 25 సంవత్సరాల క్రితం పని వెతుక్కుంటూ ఉడిపి తీర ప్రాంతానికి వలస వెళ్లింది. వీరికి తమ గ్రామంలో రెండెకరాల పొలం ఉన్నప్పటికీ.. తీవ్ర కరువు కాటకాల వల్ల వారి జీవితం దుర్భరంగా మారింది. దీంతో చేసేదేం లేక వలస కూలీలుగా వెళ్లి తాళ్లూరు గ్రామంలో స్థిర పడ్డారు దంపతులు.
అయితే.. తాళ్లూరులో ప్రజలలో బాగా మమేకం అయింది భీమవ్వ. ఆ గ్రామంలో తన కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. అక్కడి ప్రజలను అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకుంటూ వారిలో ఒకరిలా కలిసిపోయింది. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానే ముందుండేది భీమవ్వ. తనకు కావలసిన అన్ని గుర్తింపు కార్డులను ఆమె అక్కడే సంపాదించుకుంది. ఈ క్రమంలోనే కుందాపూర్ తాలూకా పంచాయతీ మాజీ సభ్యుడు కరుణ్ పూజారి దృష్టిని ఆకర్షించింది.
2020 డిసెంబర్ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా భీమవ్వను కోరారు కరుణ్ పుజారి. అందుకు ఆమె కూడా అంగీకరించడంతో.. 48 ఏళ్ళ వయసులో భీమవ్వ తాళ్లూరు గ్రామ పంచాయితీ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించే ఆమెను.. ప్రజలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారని పలువురు అభినందిస్తున్నారు. మొదటి సారి పోటీ చేసిన భీమవ్వ గెలుపొందడమే కాకుండా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రజలకు రిజర్వు చేయబడిన గ్రామ పంచాయతీకి అధ్యక్షురాలిగా కూడా ఎన్నికైంది.
అయినా.. భీమవ్వ జీవితంలో పెద్దగా మార్పు రాలేదు. గ్రామస్తులు ప్రతిరోజూ ఎదుర్కునే ఇబ్బందులను అధిగమించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్తోంది భీమవ్వ. ప్రభుత్వం నుండి వచ్చే రేషన్ కార్డులు.. ఇతర ప్రయోజనాలను ప్రజలకు అందేలా కృషి చేస్తానని చెప్తోంది. ప్రభుత్వం నుండి వచ్చే నిధులను తమ ప్రాంత ప్రజలకు అందించడానికి.. ప్రజలకు సహాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అంటోంది. కానీ.. భీమవ్వ పెద్దగా చదువుకోలేదు. గ్రామపంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటికీ.. భీమవ్వ తన మూలాలను మరిచిపోకుండా రోజూ రూ.500 కూలీ పనికి వెళ్తూ జీవనం సాగిస్తోంది బీమవ్వ.