మారుతున్న కాలంలో కులాలు, మతాలకు చాలా మంది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ.. ఇప్పటికీ కొందరు మాత్రం కట్టుబాట్లు పేరుతో ఇంకా వారు గీసుకున్న బరిలోనే బతికేస్తున్నారు. తాజాగా భోజ్ పురి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ సహర్ అఫ్సా సంచలన ప్రకటన చేసింది.
ఇక తాను సినిమాల్లో నటించబోవడంలేదని స్పష్టం చేసింది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనప్పుడు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు. కానీ సహర్ అఫ్సా మతం కోసం సినీ రంగాన్ని వదిలేస్తున్నట్టు వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇస్లాం మతం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయం ఇదేనని సహర్ అఫ్సా పేర్కొంది. మతపరమైన కారణాలతో సినీ రంగానికి వీడ్కోలు పలికిన తారలు గతంలోనూ ఉన్నారు.
దంగల్ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జైరా వాసిమ్ కూడా చిన్నవయసులోనే ఇండస్ట్రీ నుంచి వైదొలగింది. హీరోయిన్ సనా ఖాన్ కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.