భోపాల్ గ్యాస్ బాధితులకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ నుంచి అదనంగా మరింత పరిహారం ఇప్పించాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 1984 లో భోపాల్ లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన అత్యంత విషపూరితమైన గ్యాస్ కారణంగా మూడు వేలమందికి పైగా మరణించగా అనేకమంది అస్వస్థులయ్యారు. 1989 లో కుదిరిన సెటిల్మెంట్ ద్వారా యూనియన్ కార్బైడ్ సంస్థ 470 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించినప్పటికీ.. ఇది కాకుండా ఈ సంస్థ నుంచి, దీని అనుబంధ సంస్థల నుంచి అదనంగా రూ. 7,400 కోట్లను చెల్లించాలని ఆదేశించాలని కోర్టును కోరుతూ కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది.
ప్రస్తుతం యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని డౌవ్ కెమికల్స్ నిర్వహిస్తోంది. ఈ కేసును తిరగదోడాలన్న కేంద్రం అభ్యర్థనపై స్పందించిన కోర్టు.. 1989 లో ఫైనల్ సెటిల్మెంట్ కుదిరిన తరువాత ఈ వివాదాన్ని మళ్ళీ తిరగదోడజాలమని పేర్కొంది. 1989 నుంచి రూపాయి విలువ తగ్గుతున్నందున ఆ కారణంగా పరిహారాన్ని పెంచాలనడం అర్థరహితమని వివరించింది. బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేయకుండా ఇంకా రూ. 50 కోట్లు రిజర్వ్ బ్యాంక్ వద్ద నిరుపయోగంగా పడి ఉన్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా మీరు నేరుగా క్యూరేటివ్ పిటిషన్ ఎలా వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. రెండు దశాబ్దాల తరువాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హేతుబధ్ధత లేకుండా ఈ సమస్యను లేవనెత్తడం తమను అసంతృప్తికి గురి చేసిందని తీవ్రంగా మందలించినంత పని చేసింది.
క్యూరేటివ్ పిటిషన్లను విచారించజాలమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం పేర్కొంది. అయిదుగురు సభ్యులతో కూడిన ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఇంకా న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే. మహేశ్వరి సభ్యులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు తన ఉత్తర్వులను గత జనవరి 12 న రిజర్వ్ లో ఉంచింది. మొత్తానికి ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి కేంద్రానికి చుక్కెదురైంది.