సాధారణంగా మనం గుడి లోపలికి వెళ్లాలంటే ఏం చేస్తాం. ముందుగా చెప్పులు బయట విడిచి, కాళ్లు కడుక్కొని వెళ్తాం.కానుకలుగా చీరలు, వస్తువులు సమర్పిస్తుంటాం…కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయంలో మాత్రం అమ్మవారికి కానుకలుగా చెప్పులు, బూట్లు సమర్పిస్తారు.
భోపాల్ లోని కోలా ప్రాంతంలో జిజిబాయ్ ఆలయం, పహడావాలీ మాతా ఆలయానికి వెళ్లే భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చెప్పులు, బూట్లు సమర్పించి తమ కష్టాలను చెప్పుకుంటారు. దీనికి ఓ కారణముందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
అక్కడి అమ్మవారు రాత్రి పూట చెప్పులు ధరిస్తుందని… అమ్మవారికి చెప్పులు, షూలు సమర్పిస్తే ఆమె ప్రసన్నం అవుతుందని భక్తులు చెప్తున్నారు. దీంతో ఆ ఆచారం కొనసాగుతోందని పేర్కొన్నారు.జిజిబాయ్ ఆలయంలోని అమ్మవారిని భక్తులు కుమార్తెగా భావిస్తారని.. అందుకే చెప్పులు, బూట్లతో పాటు టోపీ, కళ్లద్దాలు, వాచీ వంటివి కూడా సమర్పిస్తుంటారని ఆలయ పూజారి ఓం ప్రకాష్ మహారాజ్ వెల్లడించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా విదేశాల్లో ఉండే భక్తులు సైతం అమ్మవారికి చెప్పులు, అలంకరణ సామాగ్రిని కానుకగా పంపిస్తారని ఆయన వివరించారు. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా సింగపూర్, ప్యారిస్, జర్మనీ, అమెరికా వంటి దేశాలలో నివసించే భక్తుల నుంచి అమ్మవారికి చెప్పులు వచ్చాయని పూజారి తెలిపారు.