వివాదస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఙా ఠాకూర్ కు మరో సారి చేదు అనుభవం ఎదురైంది. మొన్న ఢిల్లీ-భోపాల్ స్పైస్ జెట్ విమానంలో సిబ్బందితో గొడవ పడి 45 నిమిషాలు విమానం ఆలస్యానికి కారణమవ్వడంతో ప్రయాణీకుల ఆగ్రహానికి గురైన ఎంపీ… తాజాగా విద్యార్ధుల ఆగ్రహాన్ని చవిచూశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని మకన్ లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న శ్రేయా పాండే, మను శర్మ లను అటెండెన్స్ తక్కువగా ఉందనే కారణంతో వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్ధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని కలిసేందుకు భోపాల్ ఎంపీ ప్రజ్ఙా ఠాకూర్ క్యాంపస్ చేరుకున్నారు. దీంతో విద్యార్ధులు, బీజేపీ మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయాయి. ”టెర్రరిస్ట్ గో బ్యాక్ ” అంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఈ సంఘటనపై ప్రజ్ఙా ఠాకూర్ స్పందిస్తూ న్యాయ నిపుణుడిని సంప్రదించి ఈ ఘటనకు బాద్యులైన విద్యార్ధులపై చర్యలు తీసుకుంటామన్నారు.
బీజేపీ ఎంపీ ప్రజ్ఙా ఠాకూర్ వివాదాలతో తరచు వార్తలో ఉంటారు. 2008 మాలెగాం పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలు. ఈ పేలుళ్లలో 6 గురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలైన ఆమెపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, పేలుడు పదార్ధాలు కలిగివుండం వంటి కేసులు నమోదయ్యాయి.