నన్ను ఏడిపించాలని చూస్తున్నారు: అఖిల ప్రియ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇవాళ భూమానాగిరెడ్డి తొలి వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్థంతి సభలో భూమా కుమార్తె, ఏపీ మంత్రి అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేస్తూ అఖిల ప్రియ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి సమక్షంలోనే ఏవీ సుబ్బారెడ్డికి పరోక్షంగా హెచ్చరికలు పంపారు అఖిల ప్రియ.

గుంటనక్కలన్నీ ఒక చోటికి చేరి ఆళ్లగడ్డని పీక్కొని తినాలని చూస్తున్నాయని అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి తన నియోజకవర్గంలో మగపిల్లల్ని ఎలా పెంచారో ఆడపిల్లల్నీ కూడా సమానంగా పెంచారని.. తనను ఏడిపించేందుకు ఎన్నిప్రయత్నాలు చేసినా సాధ్యంకాదని ఆమె అన్నారు. డబ్బు.. మందు రాజకీయాలు చేసి భూమా వర్గాన్ని చీల్చాలని చూస్తున్నాయని అవేవీ ఫలించవని.. అలాంటి వాటికి లొంగేవాళ్లు అసలు భూమా వర్గమే కాదని ఆమె అన్నారు. అఖిల ప్రియ తాజాగా చేసిన వ్యాఖ్యలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.