భూపాలపల్లి జిల్లాలో నష్టపరిహారం కోసం రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మోరంచపల్లి వాగు దగ్గర దాదాపు 2వందల మంది రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరంచపల్లి వాగు పరివాహక ప్రాంతంలో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదుకుంటుందని భావించిన ప్రభుత్వం సర్వే కూడా చేయకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు.
రైతు సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన అన్నదాతలు.. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. ఎకరానికి రూ.25 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల రాజ్యం అని చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్.. ఇలా తమపై నిర్లక్ష్యం చేయడం తగదని మండిపడ్డారు రైతులు.
రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. వరంగల్ నుండి భూపాలపల్లి, కాళేశ్వరం, గోదావరిఖని వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. కాళేశ్వరం నుండి వరంగల్, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు కూడా గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోయారు.