భూపాలపల్లి రాజకీయాల్లో హై టెన్షన్ కొనసాగుతుంది. వరుసగా మూడు రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్ ను విధించడంతో పాటు ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, కాంగ్రెస్ నియోజక వర్గ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో భూపాలపల్లి పొలిటికల్ హీట్ హన్మకొండకు పాకింది.
అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను కట్టనీయకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పబ్లిక్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ నేతలపై, రేవంత్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. అయితే ఇదంతా గండ్ర రమణారెడ్డి అనుచరులే చేశారని, ఎమ్మెల్యే పథకం ప్రకారం వరుస దాడులకు ఉసిగొల్పుతున్నారని కాంగ్రెస్ వాదిస్తోంది.
ఈనేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర, కాంగ్రెస్ నేత సత్యనారాయణ ప్రతి సవాళ్లు విసురుకోవడం మరింత అగ్గిని రాజేసింది. అయితే సత్యనారాయణ మాత్రం ఇప్పటికీ తాను ఎమ్మెల్యే గండ్ర చేసిన అక్రమాలు, భూకబ్జాలను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని.. అన్నీ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని సవాల్ విసురుతున్నారు.
ధరణి పేరుతో జరిగిన కుట్రలో పేదల భూములను కొనుగోళ్ల మాటున చేజిక్కించుకున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. పోలీసుల చేత భూపాలపల్లి పట్టణంలో నిర్భంద చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇక ఇక్కడి రాజకీయాల్లో నెలకొన్న తాజా ఘటనలతో జిల్లా అంతటా కూడా ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.