తమ కంచుకోట గుజరాత్‌లో బీజేపీ మరోసారి విజయ కేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీని అందుకుంది. మొత్తం 181 అసెంబ్లీ స్థానాలకు గాను 121 స్థానాల్లో విజయం సాధించి గుజరాత్‌లో తమకు తిరుగు లేదని బీజేపీ మరోసారి నిరూపించుకుంది. ఇంకా 35 స్థానాల్లో అధికార బీజేపీ ఆధిక్యంలో ఉన్నది.
ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కేవలం 6 స్థానాల్లో విజయం సాధించింది. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఈ సారి ఎలాగైనా గుజరాత్‌లో అధికారాన్ని చేపట్టాలనుకున్న ఆప్ కు నిరాశే మిగిలింది. ఆ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మరో రెండు స్థానాల్లో లీడ్‌లో ఉన్నది.
ఇక గట్లోదియా నియోజక వర్గం నుంచి సీనియర్ నేత భూపేంద్ర పటేల్ భారీ మెజారిటీ విజయాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించడంతో రాష్ట్ర సీఎంగా భూపేంద్ర పటేల్ ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ వెల్లడించారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని గాంధీనగర్‌లో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతతో ఈ భారీ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. తమ పార్టీకి మరోసారి అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.