గుజరాత్ కొత్త సీఎం ఎవరో తేలిపోయింది. అనుకున్నట్లుగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన నేతకే సీఎం కుర్చీ అప్పగించింది బీజేపీ అధిష్టానం. గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ను ఎంపిక చేసింది.
గాంధీనగర్ లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో భూపేంద్ర పటేల్ ను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం విజయ్ రూపానీ భూపేంద్ర పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. దీంతో ఆయన్ను సీఎంగా ఎన్నుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. భూపేంద్ర ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
శనివారం సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. అయితే ఆయన తర్వాత కొత్త సీఎం ఎవరనే చర్చ గట్టిగానే నడిచింది. తెరపైకి చాలాపేర్లే వచ్చాయి. అయితే అధిష్టానం మాత్రం భూపేంద్ర పటేల్ వైపే నిలిచింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలున్న సమయంలో సీఎం మార్పు కీలకంగా మారింది.