కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో .. సమస్య పరిష్కారం కోసం స్వయంగా సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీని వేసింది ఇటీవలే సుప్రీం కోర్టు. తాజాగా ఆ నలుగురు సభ్యుల కమిటీలో ఒకరైన భారతీయ కిసాన్ సంఘం (బీకేయూ) అధ్యక్షుడు భూపీందర్‌సింగ్ మాన్ సంచలన ప్రకటన చేశారు. కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఆమన ప్రకటించారు. కమిటీలో సభ్యుడిగా నామినేట్ చేసినందుకు సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన భూపీందర్ సింగ్ మాన్.. రైతుల ప్రయోజనాలతో తాను ఎలాంటి రాజీపడబోనని స్పష్టం చేశారు. వారి కోసం ఎలాంటి పదవినైనా త్యాగం చేస్తానంటూ చెప్పారు.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి ఉద్యమం చేస్తుండటంతో.. సుప్రీంకోర్టు మూడు చట్టాలపై మంగళవారం స్టే విధించింది. రైతులతో సంప్రదింపులు జరిపి, వారి సమస్యను పరిష్కరించేందుకు అనిల్ ఘన్వాట్, అశోక్ గులాతి భూపీందర్‌సింగ్ మాన్, ప్రమోద్ కుమార్ జోషీలతో ఓ కమిటీని నియమించింది. అయితే కమిటీలో ఉన్న నలుగురు సభ్యులూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు అనుకూలంగా ఉన్నవారేనంటూ రైతు సంఘాలు, విపక్షాలు ఆపేక్షించాయి.చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఆందోళనను కొనసాగిస్తాయని తేల్చి చెప్పాయి. ఈ క్రమంలోనే భూపీందర్ సింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.