బిక్షం ఎత్తుకునే బిచ్చగాడు, వారం కూడా తిరక్కుండానే ధనవంతుడిగా మారాడు. ఇది బిచ్చగాడు-2 సినిమా కథ. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ముందుగా నైజాంలో లాభాల్లోకి వచ్చింది. తాజా వసూళ్లతో ఆంధ్రా, సీడెడ్ లో కూడా లాభాల్లోకి ఎంటరైంది.
రిలీజైన మొదటి వారాంతానికే (3 రోజులు) బిచ్చగాడు-2 సినిమా 80శాతం బ్రేక్ ఈవెన్ అయింది. మిగతా మొత్తాన్ని కలెక్ట్ చేయడానికి ఈ సినిమాకు ఎక్కువ టైమ్ పట్టలేదు. సోమ, మంగళవారం వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక బుధవారం వసూళ్లతో లాభాల్లోకి ఎంటరైంది.
అన్నీ తానై బిచ్చగాడు-2 సినిమా తీశాడు విజయ్ ఆంటోనీ. హీరోగా నటించడమే కాకుండా.. డబ్బులు పెట్టి నిర్మాతగా మారాడు. కథ తనే రాసుకున్నాడు. తనే డైరక్ట్ చేశాడు. సంగీతం అందించాడు, ఎడిటింగ్ కూడా చేశాడు. ఇంత కష్టపడి, రిస్క్ చేసి తీశాడు కాబట్టే.. పెద్దగా ఆశించకుండా మినిమం లాభానికి సినిమాను అమ్మేశాడు.
నిజానికి బిచ్చగాడు బ్రాండ్ తెలుగులో బాగా పనిచేసింది. ఇప్పటికీ విజయ్ ఆంటోనీకి బిచ్చగాడు క్రేజ్ ఉంది. ఆ బజ్ తో తను కావాలంటే మంచి రేట్లకు సీక్వెల్ ను అమ్ముకోవచ్చు. కానీ విజయ్ ఆంటోనీ ఆ పని చేయలేదు. కేవలం తనకు సక్సెస్ వస్తే చాలనుకున్నాడు. అందుకే రీజనబుల్ రేట్లకు అమ్మాడు, అనుకున్నది సాధించాడు.